శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాం: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి.. వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్షకు సిద్ధం చేసేందుకు జడ్చర్ల లోని శ్రీ లలితాంబిక దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యార్థుల భవిష్యత్తుకు ఈ శిబిరం మంచి పునాదిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 190 మంది విద్యార్థులు శిక్షణ పొందారని చెప్పారు ప్రారంభంలో కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, పది రోజుల్లోనే ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. రోజుకు దాదాపు 12 నుంచి 14 గంటలపాటు చదువుతూ పరీక్షకు సిద్ధమయ్యారని చెప్పారు.

గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 71 ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లు సాధించగా, వాటిలో 60 మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకే రావడం విశేషమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కూడా మంచి ఫలితాలు వస్తాయని, గత ఏడాది కంటే మెరుగైన విజయాలు సాధిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. గణితం, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో అందించిన శిక్షణ భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై అవగాహన పెంపొందిస్తే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సమయపాలన, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, సమిష్టిగా చదువుకునే విధానాన్ని కూడా అలవాటు చేసినట్లు తెలిపారు. ఉదయం ఐదు నుంచి ఐదున్నర గంటలకే నిద్రలేచి చదువుకోవడం వంటి అలవాట్లు వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఎనిమిదో తరగతి నుంచే క్రమబద్ధంగా చదివితే పదో తరగతిలోనూ మంచి మార్కులు సాధించవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. ఈ శిబిరం విజయవంతం కావడంలో మహబూబ్‌నగర్ ఫస్ట్ ప్రతినిధి గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, సమన్వయకర్త రవీందర్ రెడ్డి తో పాటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ఆయన అభినందించారు. తమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూనే అదనపు సమయాన్ని కేటాయించి విద్యార్థులకు శిక్షణ అందించిన ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమన్నారు.

జిల్లా విద్యాశాఖ అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు. ఏఎంఓ శ్రీనివాస్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత విజయాలు సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాంబికా తపోవనం ఆలయ చైర్మన్ జి.భాస్కర్, నాయకులు మైత్రి యాదయ్య, జాజి మొగ్గు నర్సింహులు, పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ యాదవ్, కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>