కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి నమ్మిన అలల హోరులో, భక్తజనం తరించే రామనామ స్మరణలో భద్రాచలం (Bhadrachalam Temple) పులకించిపోతోంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే శ్రీరామ భక్తుల కోటి ఆశలకు ప్రతీకగా నిలిచిన భద్రాద్రి రామాలయం, ఇప్పుడు సరికొత్త చరిత్రకు వేదికవుతోంది. రానున్న ముక్కోటి ఏకాదశి వైభవం, కనుచూపు మేరలో ఉన్న గోదావరి పుష్కరాల మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బృహత్ కార్యానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
బాసర నుంచి భద్రాచలం వరకు..
ఈ మహా యజ్ఞం కేవలం ఒక ఆలయ పునర్నిర్మాణంతో ఆగిపోలేదు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ, భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఒక సుందరమైన పర్యాటక మార్గంగా భద్రాచలాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పనులన్నీ అత్యంత వేగంగా, పకడ్బందీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. పనుల పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
మంత్రుల పరిశీలన..
క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఆలయం చుట్టూ జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్తాయిలో పర్యవేక్షస్తున్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రామిస్తూ… వేగంగా పనులు చేయిస్తూ, నిర్దేశిత గడువు కంటే సుమారు పది రోజుల ముందే పనులన్నీ పూర్తవుతాయని భరోసా కల్పిస్తుండటం గమనార్హం.
నవంబర్ 15 నుంచి మహా రాతి కట్టడాల పనులు..
ఇప్పటికే కొన్ని స్లాబుల నిర్మాణాలు పూర్తికాగా, రానున్న నవంబర్ 15 నుంచి అత్యంత కీలకమైన మహా రాతి కట్టడాల పనులు ప్రారంభం కానున్నాయి. రాతి శిల్పాలను క్షేత్రస్థాయిలో ప్రతిష్ఠించే ఈ ప్రక్రియతో ఆలయానికి మరింత ప్రాచీన వైభవం రానుంది. కొండపైన రాతిని తొలగించడం, ఒకవైపు నివాస ప్రాంతాలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పనులను కొనసాగిస్తున్నారు. కాంక్రీట్ పనులతో పాటు మాడవీధుల అభివృద్ధి పనులను కూడా సమాంతరంగా పరుగెట్టిస్తున్నారు.
గోదావరి పుష్కరాల కోసం ప్రణాళికలు..
మరోవైపు గోదావరి పుష్కరాల కోసం భద్రాచలాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉత్తర, దక్షిణ వైపులా ఘాట్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండగా, పాత గోడలకు పటిష్టమైన మరమ్మతులు చేస్తున్నారు. రామాలయం నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాలను విస్తరించడం, నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం, వైకుంఠధామానికి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల వసతి కోసం డార్మిటరీ హాల్స్, వీఐపీల కోసం ప్రత్యేక అతిథి గృహాలు, అలాగే ఐటీసీ నుంచి బ్రిడ్జి వరకు రహదారిని రంగురంగుల పూల మొక్కలతో సుందరీకరించే పనులు జోరుగా సాగుతున్నాయి.
ఉత్తర ద్వార దర్శనంపై చర్యలు..
ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి 30 వరకు జరగనున్న శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం నాటికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అర్చక, పరిచారక పోస్టుల భర్తీతో వైదిక పూజలకు మరింత శోభ సంతరించుకోనుండగా, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శన ఘట్టాలు కన్నుల పండువగా సాగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా..
శాస్త్రోత్తంగా, ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా సాగుతున్న ఈ అభివృద్ధి పవనాలు… భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రాన్ని, భద్రాద్రి పట్టణాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి భక్తులకు కనువిందు చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నాయని స్థానిక ప్రజలు, భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

