కలం, జగిత్యాల : కృష్ణా నది జలాల (Krishna River Water) విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చింతల నిర్మల గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా నిర్మలా రెడ్డి ప్రకటన మాట్లాడుతూ…”ఈ సీజన్లో అక్టోబర్ 2026 నాటికి కృష్ణా జలాల వినియోగం చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణ 127.57 టీఎంసీలు వినియోగిస్తే, ఆంధ్రప్రదేశ్ 72.237 టీఎంసీలు మాత్రమే వినియోగించిందని, అలాగే నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ 41.908 టీఎంసీలు, ఏపీ 17.207 టీఎంసీలు వినియోగించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ నీళ్లు వాడుతోందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిర్మలా రెడ్డి ఖండించారు. “మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్నాయని ఆమె వివరించారు.
ఇందులో NDSA, CWC నిపుణులు ఉన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు దించడానికి NDSA అనుమతించడం లేదని,గేట్లు దించకుండా నీళ్లు నిల్వ చేయడం సాధ్యం కాదన్నారు. మేడిగడ్డ కూలిపోవడానికి లోపభూయిష్ట డిజైన్, నిర్మాణమే కారణమని ఆమె స్పష్టం చేశారు. “మేడిగడ్డ కూలిపోవడం వల్ల ప్రాణహిత జలాలను నిల్వ చేయలేకపోతున్నాం, నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయన్నారు. తెలంగాణలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని,ఇలాంటి పరిస్థితికి కారణమైన బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని నిర్మలా రెడ్డి ఏద్దేవా చేశారు. ప్రజలు రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవాలు, గణాంకాలు, నిపుణుల నివేదికలు చూసి నిజాలు తెలుసుకోవాలని నిర్మల రెడ్డి పిలుపునిచ్చారు.

