కలం, ఖమ్మం బ్యూరో: సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.19 కోట్ల వ్యయంతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో పాటు, రూ.2 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. శుక్రవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్లతో కలిసి సత్తుపల్లి (Sathupalli)లో మంత్రి పర్యటించారు.
తొలుత ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఆశా ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థినులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్మనీ లాంటి విదేశాల్లో నర్సింగ్ విద్యకు విపరీతమైన డిమాండ్ ఉందని, మన విద్యార్థులకు జర్మన్ భాష నేర్పిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందవచ్చని తెలిపారు.
కాలేజీల్లో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణ..
ఈ ఉద్దేశంతోనే కాలేజీల్లో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పాలేరులో నర్సింగ్ కాలేజీని పూర్తిస్థాయిలో ప్రారంభించామని అన్నారు. సత్తుపల్లి నర్సింగ్ కళాశాలను కూడా రూ.19 కోట్లతో అతి త్వరలోనే అందుబాటులోకి తెచ్చి, అవసరమైన ఫ్యాకల్టీని సమకూర్చుతామన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ విద్యార్థినులు భవిష్యత్తులో మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
అనంతరం సత్తుపల్లి పట్టణంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నూతన స్పోర్ట్స్ పాలసీ, ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు క్రీడాకారులను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. సత్తుపల్లి ఇండోర్ స్టేడియం సాధన కోసం కృషి చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ (MLA Matta Ragamayee)ను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ పాషా, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సింహా, కళాశాల ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

