కలం, వనపర్తి: వనపర్తి పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన రహదారుల విస్తరణ పనులకు (Wanaparthy Road Expansion Works) ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభించారు. గురువారం పాలిటెక్నిక్ చౌరస్తా నుంచి వనపర్తి బస్ స్టాండ్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై బుల్డోజర్లతో దుకాణాల ఎదుట ఉన్న డ్రైనేజీ కాలువలు, మెట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా చేపట్టారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో పట్టణ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. పట్టణంలో వ్యాపార దుకాణాల ముందు ప్రధానంగా వాహనాల పార్కింగ్, ఇరుకైన రహదారులు, ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రహదారుల విస్తరణ అత్యవసరంగా మారింది. పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గడంతో పాటు పట్టణ రూపురేఖలు మారే అవకాశం ఉంది.
మారనున్న పట్టణ రూపురేఖలు
జిల్లా అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇటీవల సోషల్ మీడియాలో వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అభివృద్ధి పనుల ద్వారానే సమాధానం చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. పనుల అమలులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి రోడ్ల విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉంది.
వ్యాపారాలకు నష్టం కలగొద్దు
రహదారి విస్తరణలో భాగంగా దుకాణాల ఎదుట ఉన్న మెట్లు, డ్రైనేజీ కాలువలను తొలగించడంపై కొందరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలకు నష్టం కలగకుండా చూడాలని కోరుతూ తొలగింపు పనులను అడ్డుకోవడంతో కొంతసేపు అక్కడక్కడా కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా, వారి సహకారంతో మున్సిపల్ అధికారులు పనులు కొనసాగించారు.
వ్యాపారుల సహకారమే కీలకం
పట్టణ అభివృద్ధి అనేది ఒక్క ప్రభుత్వానికో, అధికారులకో సంబంధించిన బాధ్యత కాదు. రహదారి విస్తరణలో స్థలం కోల్పోతున్న దుకాణాల యజమానుల ఇబ్బందులను అధికారులు పరిగణనలోకి తీసుకుంటూనే, పట్టణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తొలగింపుల పరిధి, రహదారి హద్దులు, నిబంధనలపై స్పష్టతనిస్తూ బాధితుల అభ్యంతరాలను పరిశీలిస్తే వివాదాలకు తావుండదు. రహదారులు బాగుంటేనే పట్టణ ప్రగతికి బాటలు పడతాయి. వనపర్తిలో కార్పొరేట్ పెట్టుబడులు, వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ఆకర్షించే స్థాయికి పట్టణంలో వనరులు ఏర్పడితే జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కొరత తొలగి జిల్లాకు కొంతమేర ఎంప్లాయిమెంట్ పర్సంటేజ్ పెరగడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలలో మార్పులు ఏర్పడతాయి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు, వ్యాపార వర్గాలు, పట్టణ ప్రజలు సమన్వయంతో సహకరించాలి. అభివృద్ధి పనులకు రాజకీయాలకు అతీతంగా మద్దతు పలికితే వనపర్తి పట్టణానికి మెరుగైన రహదారులు, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

