కలం, వనపర్తి : పట్టణ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను (Graduate MLC Voter Registration) ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓటరు నమోదుకు మరో ఏడు రోజుల గడువు మాత్రమే ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అర్హులైన పట్టభద్రులను నమోదు చేయించాలని సూచించారు.
రైతులకు అండగా హరీశ్‌రావు పర్యటన
నియోజకవర్గంలో విద్యుత్ కోతల కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆరోపించారు. ఎకరాకు సుమారు రూ.25 వేల పెట్టుబడి పెట్టిన రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఎండిన పంటలపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపి, వారికి అండగా నిలిచేందుకే మాజీ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు.
ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి అధ్యక్షత వహించగా, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, విజయ్‌కుమార్, కౌన్సిలర్ మురళీ సాగర్, ఉంగ్లం తిరుమల్, వెంకట్ సాగర్, నాగన్న యాదవ్, గులాం ఖాదర్ ఖాన్, హేమంత్ ముదిరాజ్, సూర్యవంశం గిరి, జోహెబ్ హుస్సేన్, అస్లాం, స్టార్ రహీం, జె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

