పింఛన్ వెరిఫికేషన్.. లబ్ధిదారుల్లో కొత్త టెన్షన్!

కలం, నల్లగొండ బ్యూరో: ‘గ్రామంలో పింఛనుదారుల పరిశీలన (Pension Verification) కోసం అధికారులు వస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. పింఛన్ పరిశీలించేందుకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటింటికీ వస్తారు. పనులకు ఎవరూ వెళ్లవద్దు. అధికారులు వచ్చినప్పుడు ఇంటి వద్ద లేకపోతే పెన్షన్ తొలగిస్తారు..’ అంటూ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఒక వ్యక్తి చాటింపు వేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది.

రాష్ట్రంలోని పింఛన్‌ లబ్ధిదారుల్లో కొత్త టెన్షన్ నెలకొన్నది. పాత పింఛన్ల తనిఖీల పేరుతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారన్న ప్రచారం వారిని భయాందోళనలకు గురిచేస్తున్నది. ముందస్తు సమాచారం లేకుండానే అధికారులు ఇళ్లకు వస్తున్నారని, ఆ సమయంలో లబ్ధిదారులు ఇంట్లో లేకపోతే పింఛన్‌ తొలగిస్తారనే ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతున్నది.

అధికారులు ఎప్పుడైనా రావచ్చని, ఆధార్‌, రేషన్‌ కార్డు, పింఛన్‌ పుస్తకంతో లబ్ధిదారులు ఇళ్ల వద్దే అందుబాటులో ఉండాలని పంచాయతీ సిబ్బంది డప్పు చాటింపు వేయిస్తున్నారు. దీంతో అసలు తనిఖీల ఉద్దేశం ఏమిటో తెలియక లబ్ధిదారులు ఆందోళనలో పడ్డారు. మరోవైపు, పింఛన్ల కోతపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం లబ్ధిదారుల భయాలను మరింత పెంచుతున్నది.

పనులకు వెళ్లకుండా పడిగాపులు

పింఛన్ల తనిఖీల ప్రచారం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియక కూలీ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులకు వెళ్తే పింఛన్‌ ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో రోజువారీ కూలీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బతుకుదెరువు కోసం ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన లబ్ధిదారుల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. సొంతూరులో తనిఖీలు జరుగుతున్నాయన్న ప్రచారంతో తిరిగి వెళ్లాలా? వెళ్లకపోతే పింఛన్‌ తొలగిస్తారా? అనే సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు, పింఛన్ల సంఖ్యను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ తనిఖీలు చేపడుతుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మరింత పెరుగుతున్నది.

తనిఖీల వెనుక ఏరివేత వ్యూహమా?

పాత పింఛన్ల తనిఖీల వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటన్న దానిపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఈ-కేవైసీ, ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పుడు.. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ మళ్లీ ప్రత్యక్ష తనిఖీలు ఎందుకు చేపడుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న వారిలో చిన్నపాటి వివరాల వ్యత్యాసాలను సాకుగా చూపి అర్హులైన వారికి కూడా పింఛన్లు నిలిపివేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తనిఖీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక మార్గదర్శకాలు వెలువడ్డాయా? తనిఖీల విధానం ఏమిటి? ఏయే అంశాలను పరిశీలిస్తారు? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొన్నది.

ముందస్తు సమాచారం ఇవ్వాలి

పారదర్శకత కోసం తనిఖీలు చేపట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే వాటి పేరుతో భయాందోళనలకు గురిచేయడం సరికాదని లబ్ధిదారులు అంటున్నారు. తనిఖీల తేదీ, సమయం, విధివిధానాలను ముందుగానే ప్రకటిస్తే తాము అందుబాటులో ఉండేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో లేదా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఈ-కేవైసీ, ఇతర ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని, తనిఖీల పేరుతో పింఛన్లు నిలిపివేస్తారనే అపోహలకు తెరదించాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తనిఖీల ఉద్దేశం, షెడ్యూల్‌, విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>