కలం, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి (Mandalapalli) గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకేజీ తీవ్ర కలకలం రేపింది. కిచెన్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, గ్యాస్ నిరంతరం లీక్ కావడంతో ఇల్లంతా భయాందోళన నెలకొంది. అయితే, అక్కడే ఉన్న స్వాములు చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల ప్రాణాలను కాపాడిన ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
గ్రామ ఉపసర్పంచ్ చింతలపాటి మురళీ ఇంటి సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా లీకేజీ ఏర్పడి మంటలు చెలరేగడంతో కిచెన్ రూమ్ దెబ్బతింది. అదే సమయంలో అక్కడ భిక్షాటన చేస్తున్న స్వాములు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించారు. తడి గోనెసంచిని సిలిండర్‌కు గట్టిగా చుట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆరిపోయినా గ్యాస్ లీకేజీ ఆగకపోవడంతో ప్రాణనష్టం జరగకుండా సిలిండర్‌ను జనావాసాలకు దూరంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయినప్పటికీ గ్యాస్ లీక్ అవుతుండటంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై విమర్శలకు దారితీసింది. సిలిండర్ లీకేజీ ఘటనలు పదేపదే జరుగుతున్నా సంబంధిత ఏజెన్సీల అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు, వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో బరువు తనిఖీ చేసి, లీకేజీ పరీక్షలు నిర్వహించి సురక్షితంగా అందించాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యులైన ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

