కలం, అశ్వారావుపేట : సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుకుంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అశ్వారావుపేట(Aswaraopeta) యువతను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు గురువారం అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను (Social Media Influencers) ఇటీవల సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి షీల్డులు అందజేసి సన్మానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేటకు చెందిన యువకులు కూడా పాల్గొని సత్కారం అందుకున్నారు.
ఈ నేపథ్యంలో అశ్వారావుపేటకు చెందిన చీపుర్ల విజయరాజు, ధారా గణేష్, విష్ణు, రాఘవేంద్ర, చొక్కా అశోక్ బాబులను వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తన కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. యువత తమ సృజనాత్మకతతో సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు చేరువ కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరింత ప్రతిభ కనబరిచి అశ్వారావుపేట ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

