కలం, కరీంనగర్ : ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూనే, కరువు పరిస్థితులను గుర్తించి రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Hariprasad) అన్నారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు ఎండిపోయి, పెట్టుబడులు చేతికందక రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు.
కరీంనగర్(Karimnagar) జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రైతులు కోరుతుంటే, ప్రభుత్వం కేవలం కరీంనగర్ పట్టణం, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ ప్రాంతాలను మాత్రమే కరువు మండలాల జాబితాలో చేర్చడం మిగతా ప్రాంతాల రైతులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, పంట నష్టం, వర్షపాతం, సాగునీటి లభ్యతను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన అర్హులైన రైతులందరికీ న్యాయమైన పరిహారం అందించాలని, వ్యవసాయ రుణాలు, సాగు ఖర్చులు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరారు. కేవలం కొన్ని మండలాలకే సహాయాన్ని పరిమితం చేయకుండా, ఎలాంటి వివక్ష లేకుండా రైతులందరికీ ప్రభుత్వ సాయం అందించాలని అన్నారు.
కరీంనగర్ జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, పరిస్థితులపై పునఃసమీక్ష చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోందని హరిప్రసాద్ తెలిపారు. రైతుల కష్టాలను విస్మరిస్తే రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బశేట్టి కృష్ణవేణి, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, మడిపల్లి వినీత్, జంగ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

