వైద్య సేవల్లో జాప్యం వద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి

కలం, యాదగిరిగుట్ట : వెలువర్తి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Primary Health Centre) కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి, విధులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా, రోజువారీ హాజరును ప్రమాణ్ యాప్‌లో నమోదు చేస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ వస్తున్న రోగుల సంఖ్య, వారి వివరాల నమోదు ప్రక్రియపై కలెక్టర్ (Collector Anurag Jayanthi) ఆరా తీశారు. రోగుల వివరాలను అభా (ABHA)యాప్‌లో నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ల్యాబ్‌ను సందర్శించి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, సేకరించిన నమూనాలను తదుపరి పరీక్షల కోసం పంపిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు.

గర్భిణులకు నిర్వహిస్తున్న ఏఎన్‌సీ (ANC) పరీక్షల నివేదికలను పరిశీలించి, వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, ప్రసవాల కోసం ఏయే ఆసుపత్రులకు వెళ్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నవజాత శిశువులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ (HPV) టీకాల అమలుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. అర్హులైన బాలికలకు టీకాలు అందుతున్నాయా అనే వివరాలను పరిశీలించారు.

ఆరోగ్య కేంద్రం (Primary Health Centre) పరిధిలో డెంగ్యూ కేసుల నమోదు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం తదితర లక్షణాలతో వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : పార్లమెంట్​‌ను రద్దు చేయాలి : మల్లికార్జున ఖర్గే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>