క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చెంత‌కు అనిరుధ్ రెడ్డి వ్య‌వ‌హారం!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌న నియోజ‌క‌వ‌ర్గానికి నిధుల విష‌యంలో ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేసిన జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) పై అధిష్టానం సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అనిరుధ్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అనిరుధ్ అంశం క్ర‌మ‌శిక్షణ క‌మిటీ చూసుకుంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిధుల కొర‌త ఉన్న‌ద‌ని, జ‌డ్చ‌ర్ల‌లోనే కాకుండా చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అప్పుల భారంలో ఉంద‌ని ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల వ‌ల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ పాపాల‌ను మూడేళ్ల నుంచి క‌డిగేస్తున్నామ‌న్నారు. నెల‌నెలా రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్ల అప్పులు క‌డుతున్న‌ట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేల‌కు నిధుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ అనిరుధ్ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని మ‌హేశ్ కుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం జడ్చర్లలో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుద‌ల చేయాల‌ని అనిరుధ్ రెడ్డి ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. లేక‌పోతే 30 వేల మందితో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. తాను చ‌నిపోతానంటేనే బిల్లులు వ‌స్తాయంటే దానికి కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తాను బ‌తికి ఉండాలా? చ‌నిపోవాలా? అనేది ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యించాల‌ని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అధికార పార్టీలో ఉండి సొంత ప్ర‌భుత్వంపైనే ఎమ్మెల్యే ఇలా మాట్లాడ‌టం కాంగ్రెస్ నాయ‌కుల‌ను విస్మ‌యానికి గురి చేసింది. ఇక తాజాగా పీసీసీ చీఫ్ వ్యాఖ్య‌ల‌తో ఈ వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. దీంతో అనిరుధ్ రెడ్డిపై క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ ఏం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>