కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నేటి పోటీ ప్రపంచంలో విద్యార్హతలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఫస్ట్ ఆర్థిక సహకారంతో, నగరంలోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాస్క్ సంస్థ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటంతో పాటు, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
మారుతున్న కాలానికి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రస్తుత శిక్షణతోనే ఆగిపోకుండా, మరింత ఉన్నత స్థాయి కోర్సులు అభ్యసిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆశించిన లక్ష్యాలను సాధించగలరని పేర్కొన్నారు.
టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు 45 రోజుల పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాల్లో శిక్షణ అందించినట్లు తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడంతో పాటు, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు.
యువతలోని ప్రతిభను గుర్తించి, దానికి తగిన శిక్షణ అందించడం ద్వారా వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయవచ్చని తెలిపారు. మహబూబ్‌నగర్ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, తమ ప్రతిభకు తగిన ఉద్యోగాలను సాధించి కుటుంబాలకు, సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
నైపుణ్యమే విజయానికి పునాది.. శిక్షణే ఉపాధికి మార్గం అనే లక్ష్యంతో యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్న టాస్క్ సంస్థ, మహబూబ్‌నగర్ ఫస్ట్ కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, టాస్క్ సంస్థ ఇన్‌ఛార్జి సిరాజ్, కోఆర్డినేటర్ సతీష్, మాజీ కౌన్సిలర్ శరత్ చంద్ర, మహ్మద్ రియాజుద్దీన్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

