వరద ఉధృతి.. విశాఖ జిల్లాలో జలాశయాలు కళకళ!

కలం, వెబ్ డెస్క్ : అర్బన్ తుపాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా జలాశయాలకు వరద ఉధృతి భారీగా పెరిగింది. అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని పెద్దేరు జలాశయంలోకి భారీగా నీరు చేరడంతో అధికారులు 6000 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే దిగువకు విడుదల చేశారు. దీనితో మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, రాంబిల్లి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే సీలేరు గుంటవాడ రిజర్వాయర్‌కు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో, దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. రిజర్వాయర్ దిగువన ఉన్న ప్రజలు ఎవరూ వాగులు దాటవద్దని అధికారులు స్పష్టం చేశారు. తుపాను వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లాలోని రైవాడ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 112 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం నీటిమట్టం 107 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 2,744 క్యూసెక్కుల వరద వస్తుండగా, విశాఖ తాగునీటి అవసరాల నిమిత్తం 50 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

మరోవైపు, భారీ వర్షాల కారణంగా రాంబిల్లి మండలం నారాయణపురం వద్ద మైనర్ శారదా నది లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల యలమంచిలి – గాజువాక ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>