కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అణు పరిశోధనా కేంద్రం ‘సవన్నా రివర్ నేషనల్ ల్యాబొరేటరీ’లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబొరేటిరీలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అణు వ్యర్థాలు, రేడియోధార్మిక పదార్థాలు లీకై ఉండొచ్చనే భయాందోళనలు ఆ ప్రాంతంలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం వేగంగా స్పందించి.. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని (US Nuclear Emergency) ప్రకటించింది.
ఈ మేరకు ప్రమాద తీవ్రత దృష్ట్యా భద్రతా కారణాల రీత్యా అణు పరిశోధనా కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేశారు. కేంద్రం పైభాగంలో గగనతలాన్ని మూసివేయడంతో పాటు సమీపంలోని నదీ ప్రవాహం, రైలు రాకపోకలను , అలాగే పరిసర రహదారుల రాకపోకలను సైతం అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కాంప్లెక్స్‌లోని ఉద్యోగులకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించి, బయటి వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రాకుండా ఎంట్రీ బారికేడ్లను మూసివేశారు.
అయితే విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటన స్థలానికి వెంటనే చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చింది. అనంతరం జరిపిన రేడియోధార్మిక సర్వేల్లో కాంప్లెక్స్ వెలుపల ఎలాంటి హానికర రేడియేషన్ ప్రభావం పడలేదని అధికారులు నిర్ధారించారు.

