కరువు మండలాల ఎంపికపై బీజేపీ అభ్యంతరం

కలం, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో కరీంనగర్ (Karimnagar) జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కేవలం మూడు మండలాలను మాత్రమే జాబితాలో చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని, మొత్తం కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్ రావు, కనుమల్ల గణపతి, డిప్యూటీ మేయర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వై. సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

సకాలంలో వర్షాలు కురవకపోవడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో జిల్లాలో పంట దిగుబడులు పూర్తిగా దెబ్బతిన్నాయని, భూగర్భ జలాలు అడుగంటాయని వారు తెలిపారు. సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో రైతులు, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సాధారణ వర్షపాతం గణాంకాల ఆధారంగా కాకుండా, మండలాల వారీగా నమోదైన వర్షపాతం, నేలలో తేమ, పంటల నష్టం, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థాయి, ఉపగ్రహ చిత్రాలు, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి నివేదికలు, రైతుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కరువు ప్రభావిత ప్రాంతాలను శాస్త్రీయంగా అంచనా వేయాలని డిమాండ్ చేశారు.

అర్హత ఉన్న ప్రతి మండలాన్ని కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలని కోరారు. కరువు ప్రభావిత రైతులకు వర్తించే ఇన్‌పుట్ సబ్సిడీ, పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం వంటి సహాయక చర్యల అమలుపై యుద్ధ ప్రాతిపదికన సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ పరిరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ జిల్లా రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>