కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మాదకద్రవ్యాల కేసులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఐపీఎస్ సంయుక్తంగా పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ పెడ్లర్లపై నిరంతర నిఘా ఉంచి, వారి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఛేదించాలని అధికారులను ఆదేశించారు. నిందితులకు సులభంగా బెయిల్, రెమిషన్ లభించకుండా ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం పకడ్బందీగా ఆధారాలు సేకరించి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, డీ-అడిక్షన్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. కరీంనగర్‌ను మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా మార్చేందుకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంజాయి వినియోగదారులకు సీపీ, ఎస్పీలు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సమావేశంలో ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, ఈగిల్ టీమ్ ఏసీపీలు ఉపేందర్, సోమనాథ్, పుష్పన్ కుమార్‌తో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

