కలం, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో, గత ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల (Sanjay Kalvakuntla) మండిపడ్డారు. బుధవారం కోరుట్ల (Korutla) ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి దయనీయ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులను, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే, 100 పడకల ఆసుపత్రిగా సేవలందించాల్సిన కోరుట్ల ఆసుపత్రి నేడు కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయికి దిగజారిపోవడం విచారకరమని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ దాదాపు మూడేళ్లుగా దానికి తాళం వేసి ఉంచారని తెలిపారు. కనీసం తాళం చెవి కూడా అందుబాటులో లేకపోవడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల నిర్వహణ, మౌలిక వసతులపై కనీస శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సరైన వైద్య సదుపాయాలు లేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రికి అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చి, ఉచిత ఆపరేషన్లు, వైద్య పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందించాలని కోరారు.

