కలం, ఖమ్మం బ్యూరో : ‘క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ’ విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు (National Panchayat Award ) నామినేట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా (Seethampeta Banjara) గ్రామ పంచాయతీని కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై చేపట్టిన కార్యక్రమాలను, సాధించిన పురోగతిని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర బృందం.. గ్రామంలో అమలు చేస్తున్న పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాల వివరాలను, వాటి ప్రభావాన్ని అడిగి తెలుసుకుంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేంద్ర బృందంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MOPR) కార్యదర్శి పినాకి తహబిల్దార్, SOEPR కన్సల్టెంట్ సత్యజిత్ పాత్రో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష, కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి కె. ప్రభాకర్, ఎంపీడీఓ బి. భారతి, గ్రామస్థులు పాల్గొన్నారు.

