వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్

కలం, నల్లగొండ : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వ్యవసాయ విద్యుత్, కర్మాగారాల ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్, ఆయిల్ చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిఖీల్లో నలుగురు సభ్యుల ముఠా పట్టుబడగా, వారి నుంచి రూ. 50 లక్షల విలువైన ఆస్తులను వంద శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. వేములపల్లి పరిధిలోని ఎల్-15 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు చెందిన 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ నుండి 300 కిలోల కాపర్, 250 లీటర్ల ఆయిల్ దొంగతనానికి గురైన ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం వేములపల్లి సూర్యాపేట ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ  చేపట్టారు. ఈ క్రమంలో ఎర్టిగా కారులో వస్తున్న పాత నేరస్థుడు షేక్ చంద్ పాషా, అతని అనుచరులు రామావత్ సూర్యా, గలబ సాయి కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కారులో కట్టర్లు, పానాలు, గ్లౌసులు లభించడంతో విచారించగా, దొంగిలించిన కాపర్‌ను హైదరాబాద్‌లోని పాత సామాను వ్యాపారి ఇస్లావత్ దేశిరామ్‌కు అమ్మినట్లు ఎస్పీ తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారి దేశిరామ్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల నగదు, రూ.30 లక్షల విలువైన 2 కార్లు, కాపర్ వైర్, 2 కట్టర్లు, 4 పానాలు, హ్యాండ్ గ్లౌసెస్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

జల్సాలకు అలవాటుపడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను రాత్రివేళల్లో లక్ష్యంగా చేసుకునేవారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లలో తమ ముఠాలోని మహిళలను కూడా వెంట తీసుకెళ్లేవారు. ఈ ముఠా తెలంగాణలో 25 (నల్గొండలో 18, ఇతర జిల్లాల్లో 7), ఆంధ్రప్రదేశ్‌లో 4 (పల్నాడు, మాచవరం, దాచేపల్లి) కలిపి మొత్తం 29 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ముఠాలోని మరో ఐదుగురు సభ్యులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>