కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) సర్కిల్ పరిధిలో పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు, కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా, బోర్డర్ పోలీస్ స్టేషన్లలో అక్రమ రవాణాకు తావు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు (SP Srinivasa Rao) సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం గద్వాల సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి, కార్యాలయ నిర్వహణ, కేసుల పురోగతి, పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు, పరిపాలనా పత్రాలు, కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. కేసుల దర్యాప్తు ఏ దశలో ఉంది, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు ఏమిటనే అంశాలపై ఆరా తీశారు. ప్రతి కేసును నిరంతరం పర్యవేక్షిస్తూ, చట్టపరమైన ప్రక్రియలను పాటించి, నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
గద్వాల సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
వార్షిక తనిఖీలు పోలీస్ కార్యాలయాల పనితీరును సమీక్షించడంతో పాటు, లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడానికి, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి దోహదపడతాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ తనిఖీలో గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

