కరువు జాబితాలో కరీంనగర్‌కు అన్యాయం.. బండి సంజయ్ ఫైర్!

​కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితా తీవ్ర అశాస్త్రీయంగా, మొక్కుబడిగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ఎంపికలో ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించిందని, అత్యధిక లోటు వర్షపాతం నమోదైన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ​ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వంపై పలు సంచలన వ్యాఖ్యలు, ప్రశ్నలు సంధించారు.

​కరీంనగర్‌పై ఎందుకీ వివక్ష?

​”హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో పొలాలన్నీ బీళ్లుగా మారి, తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా? -35 శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చకపోవడం దారుణం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు కేటాయించాల్సి వస్తుందనే నెపంతోనే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని విస్మరించింది” అని అన్నారు.

అశాస్త్రీయంగా కరువు గుర్తింపు.. ​ఒకే ప్రమాణం ఏది?

ఒక మండలంలో వర్షం పడితే పక్క మండలంలోనూ పడినట్లే అనుకోవడం అశాస్త్రీయ పద్ధతని, రాష్ట్ర సగటును కాకుండా ప్రతి మండలాన్ని విడివిడిగా పరిశీలించాలని బండి సంజయ్ అన్నారు. కరువు గుర్తింపునకు ఉపయోగించిన వర్షపాతం, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల స్థాయికి సంబంధించిన అధికారిక నివేదికలను ప్రభుత్వం వెంటనే వెల్లడించాలన్నారు.

జాబితాలో లేని మండలాల రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, అర్హత ఉన్న ప్రతి మండలాన్ని వెంటనే కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి వాస్తవికత ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత రైతులకు తక్షణమే పరిహారం అందించి, పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించకపోతే, బాధితుల తరఫున ప్రభుత్వంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>