ఉమ్మడి వరంగల్‌ వైపుకి ‘అర్నబ్’ తుఫాన్.. ఉపశమనమా? ముప్పా?

కలం, వరంగల్‌ బ్యూరో : నిన్నటి వరకు చినుకు కోసం ఎదురుచూసిన ఉమ్మడి వరంగల్ (Warangal Rains) జిల్లాలోని రైతులు, ప్రజలు.. ఇప్పుడు భారీ వర్షాల హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో పంటలు, భూగర్భ జలాలు, సాగునీటి వనరులపై ఒత్తిడి పెరిగిన తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ (Arnab Cyclone) తెలంగాణ వైపు వర్షాలను తీసుకొస్తోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కరువు ఛాయలను ఎంతవరకు తొలగిస్తాయి? గతంలో నగరాన్ని ముంచెత్తిన వరద పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2026 వానాకాలంలో సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ రంగం ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అక్టోబర్‌లోనూ వర్షాభావం కొనసాగడంతో సాగు, పంటల దిగుబడులు, నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు తుపాను ప్రభావంతో అక్టోబర్‌ 28న ఉమ్మడి వరంగల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వర్షం వస్తే ఉపశమనం.. అతిగా కురిస్తే ముప్పు!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈసారి వర్షాల పరిస్థితి భిన్నంగా ఉంది. వానాకాలం ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలపై ప్రభావం పడింది. సెప్టెంబర్‌ చివరి నాటికి వరంగల్‌ జిల్లాలో సాధారణ వర్షపాతం 854 మిల్లీమీటర్లకు గాను 578.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 32 శాతం లోటు ఏర్పడింది. నర్సంపేట మండలంలో ఏకంగా 55 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో తుఫాన్ వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

భూమిలో తేమ పెరగడం, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం వంటి ప్రయోజనాలు కలగవచ్చు. అయితే వర్షం ఎప్పుడు, ఎంత తీవ్రతతో, ఏ ప్రాంతంలో కురుస్తుందనే అంశాలపైనే ఈ ఉపశమనం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పంట నష్టం ఎదుర్కొన్న రైతులకు ఆలస్యంగా కురిసే భారీ వర్షాలు కొన్ని సందర్భాల్లో మేలు కంటే నష్టాన్నే కలిగించే ప్రమాదం ఉంది.

గత వరద అనుభవాలు హెచ్చరిక!

గతంలో వరంగల్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వరంగల్ లో అక్టోబర్ 28 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరంగల్, హనుమకొండలోని నాలాలు, చెరువులు, వాగులు పొంగిపొర్లడం, లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలు నగరవాసులను ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా నయీంనగర్‌, శివనగర్‌, ఇతర లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పుపై ఆందోళనలు తరచూ వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తుపాను (Arnab Cyclone) ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నాలాల్లో అడ్డంకుల తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు, లోతట్టు కాలనీల్లో పర్యవేక్షణ, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు, అత్యవసర సహాయక బృందాల సిద్ధత కీలకం.

కరువు నుంచి పూర్తిగా బయటపడినట్టేనా?

భారీ వర్షాలు కురిసినంత మాత్రాన కరువు సమస్య పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేం. వర్షపాతం మండలాలవారీగా ఎంత నమోదైంది, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎంత పెరిగాయి, పంటలకు ఎంతవరకు ప్రయోజనం కలిగింది, భూగర్భ జలాల పరిస్థితి ఎలా మారింది అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అదే సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతినకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలి.

Also Read : వరంగల్ పర్యాటకానికి కొత్త శోభ.. భద్రకాళి చెరువు వద్ద అద్భుతం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>