కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర పర్యాటకానికి (Warangal Tourism) కొత్త ఆకర్షణ రానుంది. భద్రకాళి చెరువు వద్ద రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుకు సంబంధించి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రైవేటు సంస్థ ఎంపికకు టెండర్ ఫామ్ రూపొందించింది. సుమారు రూ.64.26 కోట్ల అంచనాలో చేపట్టబోయే ప్రాజెక్టులో 800 మీటర్ల పొడవైన రోప్‌వే, 230 మీటర్ల గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్‌ను ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. టెండర్ నిబంధనలు, నిర్మాణ అవసరాలు, ఒప్పంద వివరాల ఆధారంగా ఎంపికయ్యే సంస్థ తన ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థ ఎంపిక, ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టు అమలుపై స్పష్టత రానుంది. ఇది అందుబాటులోకి వస్తే భద్రకాళి చెరువు పరిసరాలను పర్యాటకులు ఈజీగా వీక్షించే అవకాశం ఉంటుంది.
పీపీపీ విధానంలో ప్రాజెక్ట్
ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్ నర్ షిప్(పీపీపీ) విధానంలో ఏర్పాటుకు కుడా ప్రతిపాదించింది. డిజైన్, నిర్మాణం, నిధులు, నిర్వహణ, బదిలీ విధానంలో పనులు చేపట్టేలా డిజైన్–బిల్డ్–ఫైనాన్స్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) నమూనాను ఎంచుకుంది. టెండర్ ద్వారా ఎంపికైన సంస్థకు 30 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా నిబంధనలు రూపొందించారు. ఇందుకు ఎంపికైన సంస్థ ప్రత్యేక ప్రయోజన సంస్థ(ఎస్పీవీ)ని ఏర్పాటు చేసి, కుడాతో రాయితీ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.
పర్యాటకులకు కొత్త అనుభూతి
భద్రకాళి చెరువు వద్ద రోప్‌వే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అదేవిధంగా పొడవైన గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్ ద్వారా సందర్శకులకు భిన్నమైన పర్యాటక అనుభూతిని అందించాలనేది కుడా ప్రణాళిక. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులనూ ఆకట్టుకునే అవకాశం ఉంది. అందుబాటులోకి వస్తే నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలకు అదనంగా మరో ఆకర్షణగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

