కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ పర్యాటక సర్క్యూట్‌కు (Warangal Tourism Circuit) జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ‘ది వీక్ హెరిటేజ్ అవార్డ్స్–2026’లో హెరిటేజ్ టూరిజం విభాగంలో ‘బెస్ట్ టూరిస్ట్ సర్క్యూట్ / బెస్ట్ టూరిస్ట్ ట్రైల్’ కేటగిరీలో సిల్వర్ బన్యన్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
కాకతీయుల చారిత్రక వైభవం, ప్రాచీన దేవాలయాలు, ప్రకృతి అందాలను అనుసంధానించే ఈ సర్క్యూట్లో వరంగల్ కోట, కాకతీయ కళాతోరణం, వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప ఆలయం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు, బొగత జలపాతం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. గిరిజన సంస్కృతి, చేనేత సంప్రదాయాలు ఈ ప్రాంత పర్యాటక ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి మార్గదర్శకత్వంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. హరిత హోటళ్లు, రిసార్టులు, బోటింగ్, రవాణా సదుపాయాలు, ప్రత్యేక పర్యాటక ప్యాకేజీల అభివృద్ధిపై దృష్టి సారించారు. ‘తెలంగాణ జారూర్ ఆనా’ ప్రచారం ద్వారా రాష్ట్ర పర్యాటక విశేషాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పురస్కారం ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంతోపాటు పర్యాటక రంగ అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.

