కలం, పెద్దపల్లి: రైతులకు సాగునీరు అందించడంలోనూ, ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (MLA Vijaya Ramana Rao) స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల, తుర్కలమద్దికుంట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకే ఐకేపీ, సింగిల్ విండో ద్వారా కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.2,462 మద్దతు ధర ఉండగా, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తోందని వివరించారు. దీంతో రైతులకు క్వింటాలుకు రూ.2,962 లభిస్తుందని, ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల సహకారంతో పది రోజుల పాటు ఎస్ఆర్ఎస్పి నీటిని అందించి పంటలు ఎండిపోకుండా కాపాడినట్లు గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఇన్ఛార్జ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే వేసవిలో సూపర్ ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సింగిల్ విండో ఛైర్మన్, డీసీఓ, మండల ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

