కలం, నిర్మల్ : రాష్ట్రస్థాయి వూషూ క్రీడా పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను (Wushu Players) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అభినందించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం విద్యార్థులకు క్రీడా సంబంధిత కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఖేలో ఇండియా వూషూ శిక్షకులు శ్రీరాముల సాయికృష్ణ పాల్గొన్నారు.

