కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లాలో వేల ఎకరాల వక్ఫ్ భూములు (Waqf Lands) అన్యాక్రాంతమవుతున్నాయని ముస్లిం నేతలు, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పలుకుబడిని ఉపయోగించుకొని ఆక్రమించుకుంటున్నారని మంగళవారం మహిబుబియా హాల్ లో సమావేశమై మాట్లాడారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణ శివారులోని చిన్నదర్పల్లి దగ్గర సర్వే నంబర్ 941,942,943 లలో విలువైన మూడున్నర ఎకరాల వక్ఫ్ భూమిని నేషనల్ హైవే బైపాస్ లో అక్రమంగా కలిపేశారని అన్నారు.
నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులను నిలదీస్తే పై సర్వే నంబర్లు కలిగిన భూమి నేషనల్ హైవే లో కల్పలేదని అర్బన్ తాసిల్దార్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులు తెల్పు తున్నారని ముస్లిం నాయకులు అన్నారు. నేషనల్ హైవే లో కలపకుంటే పై సర్వే నంబర్ల భూమి సర్వే చేసి వఖ్ఫ్ బోర్డ్ కు అప్పగించాలనిఅన్నారు.
రెండున్నర సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కి, ఆర్డీవో కి, తహసిల్దార్ కి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినా ఎందుకు సర్వే చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులదిగా చూయించి సంబంధిత అధికారులు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కాజేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. సర్వే చేయకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేయడం ఈ అనుమానానికి బలాన్ని చేకూరుస్తుందన్నారు.
అలాగే అలీ అబ్బాస్ ఆశుర్ ఖానకు సంబంధించిన సర్వేనెంబర్ 1023, 961 ఫైర్ స్టేషన్ సమీపంలోని భూమి కొందరు అక్రమంగా కబ్జా చేసారని ముస్లిం నాయకులు ఆరోపించారు. అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. సర్వే నంబర్ 230 అప్పన్నపల్లి శివారులో 18 ఎకరాల 23 గుంటల భూమి వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు ఉన్న బోర్డ్ స్వాధీనం చేసుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అందుకు రెవెన్యూ అధికారులు కూడా పూనుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా వానగట్టు, కొత్తచెరువు రోడ్డు, పీర్లబాయి తదితర అనేక ప్రాంతాల్లో వక్ఫ్ భూములు (Waqf Lands) వందలాది ఎకరాలు దురాక్రమనకు గురవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి తక్షణం వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకొని పట్టణంలోని నిరుపేద ముస్లింలకు నివాస స్థలాలకై, ఉపాధి వ్యాపారాలకై కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ముస్లిం రాజకీయ నాయకులు అన్వర్ పాషా , ఎమ్మార్జేసీ కన్వీనర్ హనీఫ్ అహ్మద్, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబర్ షేక్, ప్రముఖ మైనార్టీ నాయకులు మొహమ్మద్ అహ్మద్ అలీ సనా, ఖదీర్, మొహమ్మద్ ఇస్మాయిల్, టీఎఫ్టీయూ పట్టణ కార్యదర్శి ఎండి జలాల్ పాషా పాల్గొన్నారు.
Also Read : 100 ఎమ్మెల్యే సీట్లు మా టార్గెట్: మహేశ్ గౌడ్
Follow Us On: Instagram

