ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో (Local Body Elections) అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్క్రూట్నీ అనంతరం అధికారులు తిరస్కరించినవి పోను, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,815 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ నిర్దేశించిన సమయం ముగియడంతో ఎన్నికల అధికారులు బరిలో మిగిలిన తుది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే కసరత్తులో ఉన్నారు.

ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల వివరాల ఆధారంగా.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను పరిశీలన అనంతరం 46,045 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. అలాగే 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 4,770 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడంతో నామినేషన్ల సంఖ్య భారీగా నమోదైంది.

తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల ప్రక్రియ పూర్తయ్యాకే ఈ తుది చెల్లుబాటు సంఖ్యను అధికారులు వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ దక్కక రెబల్స్‌గా బరిలోకి దిగిన నేతలను బుజ్జగించేందుకు పార్టీల అధిష్టానాలు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశాయి. ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల (AP Local Body Elections) ప్రచారం మరింత ఊపందుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>