కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలోని వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో, భారీ గ్రానైట్ రాయి లారీ క్యాబిన్‌పై పడి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వైపు గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ అదే దిశలో కల్లూరు వైపు ప్రయాణిస్తున్న మరో వాహనాన్ని దేవరపల్లి మార్గంలోని లక్ష్మీపురం బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన తీవ్రతకు లారీలో ఉన్న భారీ గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి ఇంజన్ క్యాబిన్‌పై పడ్డాయి. దీంతో క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయి, లోపల ఇరుక్కుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మృతిచెందిన డ్రైవర్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బీర్భూమ్ జిల్లా ఖిదిర్పూర్ గ్రామానికి చెందిన షేక్ అనికుల్ (29) గా పోలీసులు గుర్తించారు. ప్రమాద ధాటికి లారీలోని భారీ గ్రానైట్ రాళ్లు రోడ్డుపై చెల్లాచెదరుగా పడటంతో గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహన రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవేపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా సోమవరం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించారు. అనంతరం క్రేన్ల సహాయంతో రోడ్డుపై పడిన గ్రానైట్ రాళ్లను తొలగించి, క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

