కలం, వెబ్ డెస్క్ : అర్నబ్ తుపాను (Arnab Cyclone) తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను నేడు తీవ్ర తుపానుగా బలపడి, రేపు మధ్యాహ్నంలోగా యానాం – బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో విశాఖ రుషికొండతో పాటు బాపట్ల జిల్లాలోని చీరాల ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లను అధికారులు పూర్తిగా మూసివేశారు. పర్యాటకులు ఎవరూ రావద్దని ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఏపీలోని 11 జిల్లాలతో పాటు యానాంలో 20 నుంచి 30 సెం.మీ మేర అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించగా, సుమారు 53 రైళ్లను రద్దు చేశారు.
మరోవైపు ఈ తుపాను (Arnab Cyclone) ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. అక్టోబర్ 28న వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్, మహబూబాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : కృష్ణా జలాల పంపిణీపై ఉత్కంఠ.. KRMB భేటీ మళ్లీ వాయిదా!
Follow Us On: X(Twitter)

