కలం, నకిరేకల్ : పేద ప్రజలకు సేవ చేయడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుండడం అభినందనీయమని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కొనియాడారు. నకిరేకల్ నియోజకవర్గం, నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఆయన సేవా సంస్థ ‘ఉద్దీపన ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పుష్పగిరి ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమానికి వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్థులకు, వృద్ధులకు ఆయన స్వయంగా ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి కంటి చూపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించి కంటి వెలుగు అందించాలనే లక్ష్యంతో ఉద్దీపన ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తోందన్నారు. అవసరమైన వారికి ఉద్దీపన, పుష్పగిరి ఫౌండేషన్ల ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని వీరేశం (Vemula Veeresham) హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వేముల పిలుపునిచ్చారు.

