కలం, నిర్మల్: పంటలకు సాగునీరు అందించేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ (Akkapur) గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన (Farmers Protest) చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన సుమారు 35 మంది రైతులు తమ పంటలకు సాగునీరు అందించుకునేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇందుకోసం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవగా, గ్రామంలో ఇటీవల అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయించిన భూ యజమానులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ కోతల కారణంగా పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే పంటలకు సకాలంలో సాగునీరు అందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

