భారత్–ఈయూ ట్రేడ్ డీల్‌పై కీలక ముందడుగు!

కలం, నేషనల్ డెస్క్: భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ (India-EU Trade Deal) ఖరారు చేసేందుకు కీలక ముందడుగు పడింది. ప్రధాని మోదీ బ్రస్సెల్స్‌ పర్యటన సందర్భంగా డిసెంబర్‌ 17 లేదా 18 తేదీల్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయాలని భారత్‌, ఈయూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒప్పంద ఆమోద ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూరోపియన్‌ కమిషన్‌ (ఈసీ) ప్రత్యేక విధానాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.

ఆమోద ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్లాన్..!

జనవరి 27న ప్రకటించిన ప్రతిపాదిత ఎఫ్‌టీఏకు త్వరితగతిన ఆమోదం లభించేలా యూరోపియన్‌ కమిషన్‌ తన మండలికి ‘ఫాస్ట్‌ట్రాక్‌ విధానం’ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఒప్పంద పత్రాన్ని ఈయూలోని 24 అధికారిక భాషల్లోకి అనువదించే వరకు ఆగకుండా, ఇంగ్లీష్ ప్రతిని ఆధారంగా చేసుకుని చట్టపరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్‌ ఆమోదం పొందిన తర్వాతే ఒప్పందంపై సంతకాలకు మార్గం సుగమం కానుంది. ఇరుపక్షాలు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా, తుది తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

జర్మనీతో భారత్ కీలక చర్చలు..

జర్మనీ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ దేశ ఆర్థిక వ్యవహారాలు, ఇంధన శాఖ మంత్రి కేథరీనా రీచెతో పాటు జర్మన్‌ ఫెడరల్‌ ఛాన్సలరీలో ఆర్థిక, ద్రవ్య విధాన సలహాదారు లెవిన్‌ హోల్లేతోనూ సమావేశమయ్యారు. భారత్‌–యూరప్ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను విస్తరించే అంశాలపై ఈ పర్యటనలో చర్చిస్తున్నారు. మొత్తంగా, ఇండియా – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలైతే ఇరుపక్షాల మధ్య వాణిజ్యానికి కొత్త అవకాశాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>