కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు, దాని కారణంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల మంత్రులు తక్షణ, దీర్ఘకాల ప్రణాళికలపై చర్చించారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ కమిటీ తొలి సమావేశంలోనూ మంత్రులు చర్చించారు. కరువు మండలాలను ప్రకటించి, ఆ జాబితాను కేంద్రానికి పంపి ఆర్థిక సాయం కోరడంపైనా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న కరువు మండలాల జాబితాను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయించింది. దీంతో ఈ నెల 28న అన్ని ప్రధాన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని (Telangana All Party Meeting) నిర్వహించి ఆ ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నది.
వీటిపైనే ప్రధానంగా చర్చ..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియెట్లో ఈ నెల 28న మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన నివారణ చర్యలు, విద్యుత్ డిమాండ్, కోతల్లేకుండా జరుగుతున్న సరఫరా, తాగునీటి సమస్యలు, రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ, లోటు వర్షపాతం, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం.. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చ జరగనున్నది.
రానున్న రబీ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన పిలుపు, అమలు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణ చర్యలు, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీల సహకారం.. వీటిపైనా చర్చ జరగనున్నది. వివిధ పార్టీలు వెల్లడించే అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోనున్నది. అవసరమైతే ఆల్-పార్టీ డెలిగేషన్ను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి ఇటీవల సూచించారు.

