కలం, అచ్చంపేట: విద్యుత్ ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం ఎల్టీ విద్యుత్ లైన్ (LT Power Line) కు సంబంధించిన ప్రమాదంలో గ్రామపంచాయతీ సిబ్బంది మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనపల్లి(Bommanapalle) కి చెందిన చౌట బాలయ్య (78) గ్రామపంచాయతీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చెట్టుపై ఉన్న కోతుల కారణంగా ఎల్టీ విద్యుత్ తీగ తెగి బాలయ్య చేతిపై పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యుత్ షాక్కు గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సేవలందిస్తున్న బాలయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

