కలం, వెబ్డెస్క్: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి (Preeti Reddy) గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్గా ఉన్న ఆమె అటు విద్యారంగంలో, ఇటు రాజకీయాల్లో, మరోవైపు పలు సినీ ఈవెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీ (Mallareddy College)లో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ హీరోయిన్ శ్రీలీల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్య తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ప్రీతి రెడ్డి బతుకమ్మను అవమానించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రీతి రెడ్డి ఈ వేడుకల్లో బతుకమ్మ ముందు కొన్ని బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్కు స్టెప్పులు వేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, పవిత్రమైన ఇలాంటి వేడుకలో ఐటెం సాంగ్స్కు డ్యాన్స్ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఏక్ దో తీన్ … అనే బాలీవుడ్ సాంగ్కు ప్రీతి రెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బతుకమ్మ ముందు ఆమె అనుచిత హావభావాలతో సినిమా స్టెప్పులు వేస్తూ ప్రవర్తించారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వేడుకల్లో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 65 అడుగుల ఎత్తుతో చేసిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతా బాగా జరిగిందని అనుకునే సమయంలో ప్రీతి రెడ్డి డ్యాన్స్ వ్యవహారం విమర్శలకు దారి తీసింది.

