కలం, కరీంనగర్ బ్యూరో : ఇటీవల రాజస్థాన్ జైపూర్ లో జరిగిన 51 వ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులు రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా శిక్షణ తీసుకుని పూర్తిగా సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేయాలని కోరారు.
జాతీయస్థాయిలో మేడ్చల్ జిల్లాకు చెందిన కట్టెకోల భవజ్ఞ ( 12 -14 ) బాలికల విభాగంలో కాంస్య పథకం సాధించి, గత రెండు దశాబ్దాల చరిత్రను తిరగేసిందని, అదే మాదిరిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన N. వాసవి (08 -10 ) బాలికల విభాగంలో ఐదవ స్థానం సాధించిందని, కరీంనగర్ కు చెందిన మరో క్రీడాకారుడు పి దీపక్ (14 -16) బాలుర విభాగంలో 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా గత సంవత్సరం ఇతడు బంగారు పతకం సాధించినట్టు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ సిద్దారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గత 22 సంవత్సరాలలో మొదటిసారి జాతీయస్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారని సిద్ధారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు జాల మనోహర్ కుమార్, రాష్ట్ర యోగ సంఘం అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శులు కుంటి రామకృష్ణ, సిహెచ్. గంగాధర్ కోచులు సిహెచ్ జయశంకర్ పోలం సునీత, ఏ ఆనంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

