కలం, సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూర్యాపేట (Suryapet) కు బుల్లెట్ రైలు స్టేషన్ను మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అలైన్మెంట్ను మారుస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తోందని బీజేపీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘బుల్లెట్ ట్రైన్ సాధన సమితి’ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 61వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బీజేపీ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
చివ్వెంల మండల పార్టీ అధ్యక్షులు మాధవరపు అనిల్ రావు ఆధ్వర్యంలో నాయకులు దీక్షలో కూర్చోగా, సంకినేని వెంకటేశ్వరరావు హాజరై వారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మొదటి రెండు అలైన్మెంట్ల ప్రకారం జాతీయ రహదారి-65కి సమాంతరంగా చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్ రైలు వెళ్లాల్సి ఉందన్నారు. దీనిప్రకారమే సూర్యాపేటకు స్టేషన్ కూడా మంజూరైందన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసం మూడో ప్రతిపాదనను (ఫ్యూచర్ సిటీ, హాలియా, వాడపల్లి మీదుగా) తెరపైకి తెచ్చి, సూర్యాపేట ప్రజలకు నోటికాడి కూడును లాగేస్తున్నారని మండిపడ్డారు.
‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటకు రైల్వే కనెక్టివిటీ లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్టేషన్ ఇస్తే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం దారుణం’ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని స్పష్టం చేయాలని, శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట స్టేషన్ మీదుగా వెళ్లేలా అసెంబ్లీ క్యాబినెట్లో తీర్మానం చేసి పంపాలని సంకినేని డిమాండ్ చేశారు. అలా తీర్మానం చేస్తే, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ద్వారా సూర్యాపేట అలైన్మెంట్కు డీపీఆర్ అప్రూవల్ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కీషన్, నాయకులు పేర్వాల లక్ష్మణరావు, జంపాల వెంకన్న, జానీ బాషా, చివ్వెంల మండల బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

