కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ(Bathukamma) వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారి ఎ. వాణీ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించడంతో పాటు, ఫొటోలు, వీడియోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బతుకమ్మ వేడుకల నిర్వహణ, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని వాణీ ప్రసాద్ తెలిపారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు, రవాణా, పార్కింగ్, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ విశిష్టతతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినోపై అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయం, పర్యావరణంపై పడే ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని వాణీ ప్రసాద్ సూచించారు. బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించి, వాటిలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
పర్యాటక ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను జిల్లాలకు బదిలీ చేసిన నేపథ్యంలో స్థానిక ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, పనులు పూర్తయిన వెంటనే సంబంధిత బిల్లులను పర్యాటక కార్పొరేషన్‌కు సమర్పించాలని సూచించారు. పర్యాటక అభివృద్ధి పనులకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ బాధ్యతలను రెండు వారాల్లోగా సంబంధిత ఇంజినీరింగ్ శాఖలకు లేదా తగిన సంస్థలకు అప్పగించాలని తెలిపారు. అవసరమైన చోట కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హరిత హోటళ్ల పూర్తికి పీపీపీ విధానం
కొన్ని జిల్లాల్లో పాక్షికంగా పూర్తయిన హరిత హోటళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణీ ప్రసాద్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపే ప్రైవేటు పెట్టుబడిదారులను జిల్లా స్థాయిలో గుర్తించి, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లాల వారీగా సమగ్ర పర్యాటక ప్రణాళికలు
ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి, సమగ్ర ప్రణాళికతో పాటు ఆకర్షణీయమైన ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని వాణీ ప్రసాద్ ఆదేశించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, వారసత్వ ప్రాంతాలను గుర్తించి, వాటికి అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, అంచనా వ్యయం, అమలు విధానం, పర్యాటకుల సౌకర్యాల వివరాలను ప్రణాళికలో పొందుపరచాలని తెలిపారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా నిధుల సమీకరణకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా స్వదేశ్ దర్శన్ పథకం కింద జిల్లాలకు అనువైన పర్యాటక ప్రాజెక్టులను గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్, వసతి, సమాచార బోర్డులు, భద్రత వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. స్థానిక కళలు, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, స్థానిక ఆహార సంస్కృతిని పర్యాటకంతో అనుసంధానించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని సూచించారు.
పర్యాటక ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యం
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వాణీ ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలకు పంపిన పర్యాటక ప్రాంతాల జాబితాను పరిశీలించి, అవసరమైన చోట ఔట్సోర్సింగ్ విధానంలో భద్రతా సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృతిక, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కె. ధనంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

