కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ బొగ్గు గని ప్రాంతంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రామగుండం వేదికగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు గులాబీ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నల్లబంగారు క్షేత్రమైన రామగుండంలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ (BRS Singareni Meeting) జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మిక లోకానికి దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించిన గులాబీ పార్టీ.. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమర శంఖం పూరించింది. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నేతృత్వంలో.. టీబీజీకేఎస్ నాయకులు ఈ గర్జనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సభ ఏర్పాట్లను, పెద్దపల్లి డిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు నేతలు పరిశీలించారు.
కార్మికుల పెండింగ్ అలవెన్సులు, పని భద్రతపై ప్రభుత్వాన్ని నిలదీయడం, క్వార్టర్ల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాలు, మౌలిక వసతుల కల్పనలో జాప్యంపై నిరసన తెలుపనున్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు, ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవడం, వారసత్వ కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని డిమాండ్ చేయనున్నారు.
గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు ఈ సభకు తరలిరానుండటంతో ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఈ గర్జన తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సభలో కేటీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

