రబీ సాగుపై నీలినీడలు.. రైతన్నకు తప్పని గండం!

కలం, తెలంగాణ బ్యూరో: ఖరీఫ్ సీజన్ నష్టాల నుంచి కోలుకోకముందే రాష్ట్ర రైతాంగానికి రబీ (యాసంగి) సీజన్ మరో పెద్ద సవాలుగా మారనున్నది. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఖరీఫ్ దెబ్బతినగా.. ఇప్పుడు ఎల్‌ నినో ప్రభావం, నీటి కొరత కారణంగా రబీ సాగు ‘క్రాప్ హాలీడే’ (Rabi Crop Holiday) కు దారి తీయనుందా? అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అన్ని రకాల పంటల సాగు ఈసారి భారీ స్థాయిలో తగ్గవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది మొత్తం 92 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. అందులో వరి వాటా 65 లక్షల ఎకరాలపైనే ఉంది. మొత్తం 80 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.

అయితే ఈసారి ఎల్‌ నినో ప్రభావం, కరెంటు కోతలు ఉండే అవకాశంతో రబీ సాగు విస్తీర్ణం భారీ స్థాయిలో తగ్గే అవకాశమున్నది. యాసంగి పంట కావడంతో కేవలం బోరు బావుల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోవడం, కరెంటు డిమాండ్ పెరగడంతో ‘పవర్ కట్స్’ ఉండొచ్చని ప్రభుత్వం సంకేతాలివ్వడంతో రైతులు స్వచ్ఛందంగా ‘క్రాప్ హాలీడే’ ప్రకటించుకుంటారా? లేక ప్రభుత్వ సూచనల మేరకు కూరగాయల్లాంటి ఆరుతడి పంటలకే పరిమితమవుతారా? అన్నది రానున్న రోజుల్లో తేలనున్నది.

అయోమయంలో రైతాంగం

ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌ నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెప్పినా.. చాలామంది రైతులు బోరుబావుల ద్వారా సాగు చేసుకోవచ్చన్న ధీమాతో కోటి 26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగులోకి తెచ్చారు. ఇందులో వరి విస్తీర్ణం దాదాపు 57 లక్షల ఎకరాలు. ఈసారి వానాకాలంలో దాదాపు 70 లక్షల ఎకరాల మేర వరి సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినా ఎల్‌ నినో కారణంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించడంతో అది 57లక్షల ఎకరాలకు పరిమితమైంది. సహజంగా వానాకాలం సీజన్లో వరిసాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండాల్సినప్పటికీ.. గత యాసంగి (65.42 లక్షల ఎకరాలు) కంటే తగ్గడం గమనార్హం.

ఇదిలాఉంటే ఎల్‌ నినో ఎఫెక్ట్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకూ కొనసాగుతుందని, ఆ తర్వాత సమ్మర్ తోడవుతుందని ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు తుది దశకు చేరుకుంటున్నా.. కనీస స్థాయిలోనూ నీరు అందకపోవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రబీలో మరింత ఘోరమైన పరిస్థితులు ఉంటాయని రైతులు అంచనాకు వచ్చారు.

కరెంటు కోతలు తప్పవా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కింద ఎల్‌ నినోపై రివ్యూ సందర్భంగా ఈసారి విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, పొదుపుగా వాడుకోవాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపేయాలని, ఓపెన్ మార్కెట్లో కొందామన్నా కరెంటు దొరకడం లేదని పరోక్షంగా ‘కరెంటు కోతలు’ తప్పవనే సంకేతాలిచ్చారు. దీంతో వానాకాలం పంటకంటే యాసంగి దయనీయంగా ఉంటుందనే ఆందోళనతో రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది.. వ్యవసాయ శాఖ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుంది.. ఇవన్నీ కీలకంగా మారాయి. ఖరీఫ్‌లో పంటలు వేసి ఆర్థికంగా నష్టపోయిన రైతాంగం.. రబీ సీజన్లో మరింత నష్టపోవడానికి మానసికంగా సిద్ధంగా లేదు. దీంతో ప్రస్తుతం వ్యవసాయ అంచనా వేస్తున్నట్లుగా 70 లక్షల ఎకరాల వరకైనా సాగు ఉంటుందా? లేక ప్రభుత్వమే పాక్షికంగా క్రాప్ హాలీడే ప్రకటిస్తుందా? లేక రైతులే స్వచ్ఛందంగా సాగును పరిమితం చేసుకుంటారా? వంటి మాటలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ వర్శిటీ కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.

రానున్నది గడ్డు కాలమే

ఎల్‌ నినో ఎఫెక్ట్ కేవలం వ్యవసాయం మీదనే కాక ఇతర రంగాలమీద కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నది. సాగునీటికే కాక తాగునీటికీ ఇబ్బందులు మొదలయ్యాయి. వచ్చే సంవత్సరం వేసవి వరకు గ్రామాలకు, పట్టణాలకు తాగునీటి సరఫరా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు కూడా సరిపోతాయో.. లేవో.. అనే చర్చ వివిధ డిపార్టుమెంట్ల అధికారుల మధ్య మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంటల నష్టం, రాబోయే రబీ సీజన్ పంటల ప్రణాళికపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>