కలం, స్పోర్ట్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మరో బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)కు తొలి రౌండ్లోనే అత్యంత కఠినమైన సవాలు ఎదురుకానుంది. తొలి పోరులోనే ఆమె ప్రపంచ నంబర్ వన్, ఒలింపిక్ ఛాంపియన్ కొరియాకు చెందిన అన్ సే యంగ్‌తో తలపడనుంది. ఈ ఏడాది జపాన్ ఓపెన్ గెలిచి ఫామ్‌లో ఉన్న సింధుకు, అన్ సే యంగ్‌పై ఇప్పటివరకు ఉన్న ముఖాముఖి రికార్డులో ఒక్క విజయం కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ ఓటమి తర్వాత సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి జంట మళ్లీ మైదానంలోకి దిగుతోంది. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, చైనా మాస్టర్స్ గెలిచిన ఈ భారత ద్వయం డెన్మార్క్‌లో మరో ట్రోఫీపై కన్నేసింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ తన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 3వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ను ఢీకొననుండగా, ఆయుష్ శెట్టి, మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ, అశ్మిత చలిహా, దేవిక సిహాగ్, ఉన్నతి హుడా పోటీ పడుతుండగా, డబుల్స్‌లో త్రీసా జాలీ – గాయత్రి గోపీచంద్ జోడీ భారత సవాలును నడిపించనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత ప్రాతినిధ్యం లేకపోవడంతో మిగతా విభాగాలపైనే ఆశలు నిలిచాయి.

