కలం, ఖమ్మం బ్యూరో: ప్రజల సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో నిర్వహించే ‘ప్రజావాణి’ కీలకమని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజావాణిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం దమ్మపేట (Dammapeta) మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు.. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును వేగంగా పరిష్కరించాలని ఎంపీడీవోను ఆదేశించారు.
అనంతరం మండలంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతేడాదితో పోలిస్తే మండలంలోని 230 చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున, ఇరిగేషన్ అధికారులు నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫరా అందించాలన్నారు. రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ ద్వారా ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

