కలం, వరంగల్: వరంగల్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ న్యూసెన్స్ సృష్టిస్తున్న వారిపై జిల్లా పోలీసులు (Warangal Police) చర్యలు చేపట్టారు. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘ఆపరేషన్ చెబుత్రా’లో 28 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి నుంచి 10 మోటార్ సైకిళ్లు, 24 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సీపీ ఎన్.శ్వేత ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవించిన 15 మందిపై సీపీ యాక్ట్ సెక్షన్ 70(ఏ) కింద, న్యూసెన్స్‌కు పాల్పడిన మరో 13 మందిపై సెక్షన్లు 21, 70, 76 కింద కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి, అర్ధరాత్రి అనవసరంగా తిరగడం, బహిరంగంగా మద్యం సేవించడం వల్ల కలిగే పరిణామాలను వివరించారు.
నిరంతరం తనిఖీలు..
‘ఆపరేషన్ చెబుత్రా’లో భాగంగా ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో 40 మంది పోలీసులు పాల్గొన్నారు.

