కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నిర్వహణకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి గోదావరి నదీ తీర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. ఆర్అండ్ బి టెండర్ల మినహాయింపు ప్రక్రియ, భూసేకరణ నిధుల విడుదలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటిమట్టం తగ్గిన వెంటనే నవంబర్‌లో నీటిపారుదల పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల పొడవు, విస్తరణపై జిల్లాల అవసరాలకు అనుగుణంగా కలెక్టర్లు శనివారం నాటికి తుది నిర్ణయానికి రావాలని తెలిపారు. అలాగే అదనపు నిధుల ప్రతిపాదనలను క్యాబినెట్ సబ్‌కమిటీకి పంపేందుకు ప్రాధాన్యతా పనుల జాబితాను అందజేయాలని ఆదేశించారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కర పనులను గడువులోగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ స్పందిస్తూ.. భద్రాచలంలో పుష్కర ఘాట్లకు, వైకుంఠధామానికి ఒకే మార్గం ఉన్నందున రద్దీ సమయంలో మృతదేహాల తరలింపునకు ఇబ్బందులు లేకుండా వైకుంఠధామానికి ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీవో సునీత, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, పీఆర్ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

