కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా ఏర్పాటు దశాబ్ది ఉత్సవాల వేదికగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలన వల్ల రాష్ట్రంలో సాగునీరు, కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, రైతులు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సభలో నేతలు ప్రసంగిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ఆ వివరాలు నేతల మాటల్లోనే..
రైతులు అల్లాడిపోతున్నారు.. జీవన్ రెడ్డి ఫైర్
రేవంత్ రెడ్డి పాలనలో సాగునీరు లేదు, కరెంట్ లేదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా రేవంత్ రెడ్డి మూర్ఖత్వం, పాలన వైఫల్యమేనని మండిపడ్డారు. కేవలం యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయలేక నేడు కరెంట్ కొరత సృష్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, నేడు రేవంత్ అసమర్థతతో పంటలు ఎండిపోతున్నాయని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. “జగిత్యాలలో మెడికల్ కళాశాల భవనాలు ఎందుకు పూర్తి కాలేదు? నిధులు మంజూరు చేయకుండా, స్వార్థం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు దీనికి ఏం సమాధానం చెప్తారు?” అని నిలదీశారు.
మంత్రులకు సిగ్గుండాలి – కొప్పుల ఈశ్వర్
ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని.. పదేళ్ల కాలంలో దేశ చరిత్రలో ఎరుగని రీతిలో అన్ని వర్గాల సంక్షేమానికి ఆయన పాటుపడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) కొనియాడారు. “తక్కువ నీటి వినియోగంతో పంటలు వేయాలని చెప్పడానికి ఓ మంత్రి కావాలా? అలాంటి మంత్రులకు సిగ్గుండాలి. కేసీఆర్ 273 కోట్ల మొక్కలు నాటితే, రేవంత్ రెడ్డికి అసలు ఆ మొక్కల విలువ తెలుసా? నేడు 4 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యను సర్వనాశనం చేశారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను అణగద్రొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోం.” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ క్యూలైన్లు – విద్యాసాగర్ రావు
చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన ఘనత కేసీఆర్‌ది పార్టీ జిల్లా అధ్యక్షులు – విద్యాసాగర్ రావు కొనియాడారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గమైన పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. “మెడికల్ కళాశాల పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే పనులను జాప్యం చేశారు. యూరియా కోసం మళ్లీ చెప్పులు క్యూలో పెట్టే పాత రోజులను కాంగ్రెస్ తెచ్చింది.” అని ఫైర్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు, లోక బాపురెడ్డి, తొలి జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్ తదితరులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమగీతం పాడే వరకు బీఆర్ఎస్ శ్రేణులు విశ్రమించవని పిలుపునిచ్చారు.

