కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం (Karakagudem) మండలం కల్వలనాగారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర (30) హత్యోదంతం స్థానికంగా కలకలం రేపింది. అందరితోనూ కలుపుగోలుగా, మంచితనంగా ఉండే రవిచంద్ర ఆదివారం రాత్రి అంతుచిక్కని రీతిలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కరకగూడెం గ్రామానికి చెందిన ఇమ్రాన్ కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసి, బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానంతో కల్వలనాగారం గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడనే కోపంతో గ్రామస్తులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువకుడి అకస్మాత్తు మరణంతో కల్వలనాగారంలో విషాద ఛాయలు అలుముకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

