కలం, స్పోర్ట్స్ : భారత్–శ్రీలంక (Ind vs SL) తొలి వన్డే వేదిక మార్పుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది. డిసెంబర్ 13న ఢిల్లీలోనే మ్యాచ్ జరగనుందని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌కు మ్యాచ్‌ను తరలించే నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాచ్ వేదిక మారవచ్చని వార్తలు వచ్చాయి. తొలి వన్డేను అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత్, శ్రీలంక జట్లు (Ind vs SL) డిసెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. డిసెంబర్ 13న ఢిల్లీలో తొలి వన్డే జరగనుంది. డిసెంబర్ 16న బెంగళూరులో రెండో వన్డే, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో మూడో వన్డే నిర్వహించనున్నారు. వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 22న రాజ్‌కోట్‌లో తొలి టీ20, డిసెంబర్ 24న కటక్‌లో రెండో టీ20 జరగనున్నాయి. డిసెంబర్ 27న పుణెలో చివరి టీ20తో పర్యటన ముగియనుంది.

