కలం, నిర్మల్ : గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. దసరా పండుగ వేళ వేతనాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు రూ.30 వేల వేతనం చెల్లించాలని, రెండో పీఆర్సీ అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అందించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించి, అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలను ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్లో అందజేశారు.

